3 July, 2026 | 12:17 PM

సీతంపేటలో SIR ప్రక్రియను వేగవంతం చేయాలి

03-07-2026 11:08 AM

సీతంపేట ఉప సర్పంచ్ ఇందారపు నవీన్

ముత్తారం, జూలై 03(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీతంపేట ఉప సర్పంచ్ ఇందారపు నవీన్ సూచించారు. శుక్రవారం మండలంలోని సీతంపేట గ్రామంలో కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు, ధృవీకరణ, మార్పులు, చేర్పులు, సంబంధిత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉన్న బీఎల్‌వోలతో మాట్లాడి ఇప్పటివరకు పూర్తైన మ్యాపింగ్, అన్‌మ్యాపింగ్ వివరాలు, పెండింగ్ దరఖాస్తులు, వాటి పరిష్కార చర్యలపై ఆరా తీశారు. ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా బీఎల్‌వోలు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. SIR కార్యక్రమంలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలు కూడా తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని ఉప సర్పంచ్  నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగుల కుమార్, లింగం సురేష్, ప్రవీణ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.