3 July, 2026 | 11:50 AM

4 ఎకరాల లోపు రైతులకు వరకు రైతు భరోసా

03-07-2026 10:48 AM

2.98 లక్షల మంది రైతులకు రైతు భరోసా జమ

జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య

ఖమ్మం(విజయక్రాంతి): వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి 4 ఎకరాల వరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం క్రింద ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 2,98,513 మంది రైతులకు 255.75 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలుపుతూ, నియోజకవర్గాల వారీగా రైతు భరోసా జమ వివరాలు వెల్లడించారు.ఖమ్మం నియోజకవర్గంలో 16,197 మంది రైతులకు రూ.14.69 కోట్లు, పాలేరు నియోజక వర్గంలో 71,029 మంది రైతులకు రూ.58.08 కోట్లు, సత్తుపల్లి నియోజక వర్గంలో 74,682 మంది రైతులకు రూ.62.19 కోట్లు, మధిర నియోజకవర్గంలో 78,832 మంది రైతులకు రూ.66.28 కోట్లు, వైరా నియోజకవర్గంలో 56,673 మంది రైతులకు రూ.53.78 కోట్లు, ఇల్లందు నియోజక వర్గంలోని కామేపల్లి మండలంలోని 1,100 మంది రైతులకు రూ.73 లక్షలు జమ చేసినట్లు పేర్కొన్నారు.

రైతు భరోసా పథకం ద్వారా సాగు ప్రారంభ దశలో రైతులకు అవసరమైన పెట్టుబడి సకాలంలో అందడంతో వ్యవసాయ పనులు వేగవంతంగా చేపట్టేందుకు ఈ ఆర్థిక సహాయం దోహదపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించి ప్రభుత్వం జమ చేసిన రైతు భరోసా మొత్తాన్ని నిర్ధారించుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం ప్రయోజనం అందేలా వ్యవసాయ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు.