13 August, 2026 | 2:47 AM

11.56 లక్షల ఇళ్లు కేటాయించండి

13-08-2026 12:00 AM
  1. జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలి
  2. కేంద్ర మంత్రి చౌహాన్‌కు మంత్రి పొంగులేటి వినతి

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద తెలంగాణకు ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రా న్ని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన వినతిపత్రం అందజేశారు.  సీఎం రేవంత్ రాసిన లేఖను ఈ సందర్భంగా పొంగులేటి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆవాస్ ప్లస్-2024’ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ సర్వేలో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా తేలాయని తెలిపారు. వీటికి సంబంధించి సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ, కేంద్రం నుంచి లక్ష్యాల ప్రకటనలో జాప్యం జరుగుతోందన్నారు.

పీఎంఏవై జీ కింద ఇచ్చే కేంద్ర వాటా, సాధారణ రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా ప్ర తి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణలో పర్యటించాలని మంత్రి పొంగులేటి సాదరంగా ఆహ్వానించారు.

స్వయంగా రాష్ట్రానికి వచ్చి పీఎంఏవై 2.0 కింద ఇళ్ల కేటాయింపును ప్రకటిస్తే, గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలుస్తుందని,  చరిత్రాత్మక ఘట్టంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు.

కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాం రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తదితరులు ఉన్నారు.