గురుకులాల్లో విద్యార్థినులతో వెట్టి చాకిరా...?
విద్యా బుద్ధులు చెప్పాలాసింది... పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు
ఆరు నెలల క్రితం విద్యార్థిని మృతి ఘటనతోనైనా తీరు మారని వైనం
ప్రిన్సిపాల్,ఉపాధ్యాయుల తీరుపై మండి పడుతున్న తల్లిదండ్రులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం బాలికల గురుకుల పాఠశాల దుస్థితి
బాన్సువాడ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యార్థినీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. కార్పొరేట్ స్థాయిలో విద్యతోపాటు అన్ని వసతులను కల్పించి, విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉత్తమ బోధన చేస్తూ ఉపాధ్యాయులు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది వెయ్యాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడం ఇష్టారీతిన గురుకుల పాఠశాలలను నిర్వహించడం అటు ప్రిన్సిపాల్ లు ఇటు ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను అందించాల్సింది పోయి వెట్టిచాకిరి ఇతర పనులు చేయిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారితో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా విద్యార్థినులతో కుర్చీలు మోయించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులతో పాఠశాల కార్యక్రమాల పేరుతో కుర్చీలు, ఇతర సామగ్రి మోయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల చేత పనులు చేయించకుండా అవసరమైన సిబ్బందితో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యానిదేనని పలువురు పేర్కొంటున్నారు.
ఆరు నెలల క్రితం విషాదం మరిచారా?
ఇదిలా ఉండగా, సుమారు ఆరు నెలల క్రితం ఇదే గురుకుల పాఠశాలలో కుర్చీలు మోసే ఘటనకు సంబంధించిన విషాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటనను పలువురు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం మళ్లీ విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం పట్ల తల్లిదండ్రులు మేధావులు మండిపడుతున్నారు. ఆరు నెలల క్రితం ఇదే కుర్చీల ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందడంతో పాటు పలువురు విద్యార్థులకు గాయాలైన, ఘటనలో ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్న సంఘటనలు మర్చిపోకముందే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల పలువురు పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు కాగితాలకే పరిమితమా?
విద్యార్థుల భద్రతపై ఎన్నో నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
తల్లిదండ్రుల ప్రశ్నలు.. అధికారుల జవాబు ఏదీ?.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురుకులాల్లో వారితో పనులు చేయించడం ఎప్పుడు ఆగుతుంది? గత ఘటన నుంచి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఏమి నేర్చుకున్నారు? విద్యార్థుల భద్రతకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వినిపిస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇకనైనా ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థినీలకు మంచి విద్యాబోధన ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు ఉత్తమ బోధన చేయించాలి కానీ విద్యార్థినీలతో కుర్చీలు ముగించడం ఇతర పనులు చేయించిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి విచారణ చేపట్టాలని బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో విద్యార్థినీలతో పనులు చేయించరని ఆయన కోరారు. ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశామని రెండు మూడు రోజుల్లో గా ప్రిన్సిపాల్ ను వివరణ కోరి బాధ్యతలపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.






