15 August, 2026 | 1:52 AM

హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం

15-08-2026 12:52 AM
  1. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
  2. మహిళా సమాఖ్య తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

గణపురం, ఆగస్టు14 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని గంప సముద్రం సరస్సు కట్టపై నిర్మించనున్న హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విస్తృతంగా పర్యటించారు.

గణప సముద్రం సరస్సుపై నిర్మించనున్న శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి నూతన ఆలయ నిర్మాణానికి స్థపతి డాక్టర్ ఆకుల రవికుమార్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ గోవర్ధన వేణుగోపాలచార్యులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ నెల 17న భూమిపూజ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

అనంతరం స్వర్ణభారతి మండల సమాఖ్య తాత్కాలిక భవనాన్ని ప్రారంభించి మహిళా సమాఖ్య ఉద్యోగులు, మహిళలతో సమావేశమయ్యారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్రోల్ బంకులు, అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్, తహసీల్దార్  అడ్డూరి రాజేశ్వరరావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.