30 June, 2026 | 9:28 PM

Breaking News

వ్యవసాయ కళాశాల ప్రతిభకు కిరీటం

24-02-2026 01:19 AM

తంగళ్ళపల్లి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు మరియు ఆధునిక ఆలోచనలను వెలికితీసే ఉద్దేశంతో నిర్వహించిన అగ్రి యూత్ ఫెస్ట్(యువజనోత్సవాలు) ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాజేంద్రనగర్లో ఘనంగా జరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ యువజనోత్సవాల్లో  విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. గ్రీన్ ఎక్స్పో, స్టోరీ టెల్లింగ్, జానపద గీతాలు, ఒగ్గుకథ, డ్యాన్స్ బీట్ లైవ్ పోటీలలో ప్రథమ స్థానాలు సాధించారు. ఉపన్యాసం, వ్యాసరచన, దేశభక్తి గీత రచన, స్పెల్ బీ, ఎకో రంగోలి, లైవ్ పెయింటింగ్ పోటీలలో ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. జానపద నృత్య ప్రదర్శనలో తృతీయ స్థానం సాధించారు.

విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతకు గుర్తింపుగా ఈ యువజనోత్సవాల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ను బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల అందుకుంది. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. కె.బి. సునీతాదేవి విద్యార్థులను అభినందించారు. యూనివర్శిటీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. కళాశాలకు మంచి పేరు తీసుకురావడంలో కృషి చేసిన విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని కళాశాలకు మరింత ప్రతిష్ట తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.