13 July, 2026 | 4:13 PM

పిల్లల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ కె. హైమావతి

13-07-2026 03:03 PM

కొండపాక, జులై 13: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపాక మండలం దుద్దెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎదుగుతున్న పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం అత్యంత ముఖ్యమని అన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, నులిపురుగుల సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రను తీసుకోవాలని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పిల్లలే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తారని కలెక్టర్ హైమావతి అన్నారు.

అనంతరం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్య, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.