పాక్ ఐసీస్ స్థావరాలపై ఆఫ్గన్ దాడులు
తమదేశంపై దాడులకు ప్రతీకారమన్న రక్షణశాఖ మంత్రి
ఇస్లామాబాద్, జూన్ 1: పాకిస్థాన్‌లోని ఐసీస్ స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని ఆఫ్గనిస్థాన్ ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగించామని బుధవారం ఎక్స్‌లో పోస్టు చేసింది. బలూచిస్థాన్‌లోని పిషిన్ జిల్లా సరనాన్ వద్ద ఉన్న ఐసీస్ జాయింట్ సెంటర్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. పాక్ అఫ్గన్‌పై చేసిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని స్పష్టం చేసింది. ఈ దాడుల్లో పలువురు ఐఎస్ గ్రూప్ సభ్యులు మృతిచెందారని తెలిపింది.
తమకు ముప్పుగా మారిన ఏ ఒక్క టార్గెట్‌ను వదిలిపెట్టబోమని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రోన్ దాడులపై ఆఫ్గన్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, దానికి తగిన విధంగా బదులు చెబుతామని పాక్ సైన్యం ప్రకటించింది. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తాలిబన్లను హెచ్చరించింది. కాగా సోమవారం పాక్ అఫ్గన్‌పై జరిపిన దాడుల్లో 36 మంది పౌరులు మృతి చెందగా, 163 మందికి గాయాలయ్యాయి. పాక్ జరిపిన ఈ దాడిని ఖండిస్తూ ఆఫ్గన్ ఐక్యరాజ్యసమితి పరిస్థితిని పర్యవేక్షించాలని కోరింది. దీంతో యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ తక్షణమే ఘర్షణలు విరమించు కోవాలని, పౌరులను రక్షించాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.






