2 July, 2026 | 1:12 AM

‘వీబీ జీ రామ్ జీ’ వేతనాల పెంపు

02-07-2026 12:29 AM
  1. కనిష్ఠంగా రోజుకు రూ. 300 నుంచి గరిష్ఠంగా రూ. 409కి పెంపు
  2. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో పెంపు 3 శాతమే

న్యూఢిల్లీ, జూలై 1: వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) కింద చెల్లించే రోజువారి వేతనాలను కనిష్ఠంగా రూ. 300 నుంచి గరిష్ఠంగా రూ. 409కు పెంచుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం కొన్ని పంచాయతీల్లో అత్యధికంగా రూ. 450 వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్కండ్, అసోం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బంగాల్‌లో ఉపాధి హామీ పథకంతో పోలిస్తే ఇప్పుడు వేతనాలు 15 శాతానికిపైగా పెరిగాయి.

కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం 3 శాతం కంటే తక్కువే పెంచడం గమనార్హం. ఈ పథకం కింద 21 రాష్ట్రాల్లో రోజువారీ వేతనం రూ.300గా నిర్ణయించారు. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ పాటు పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో రోజువారి వేతనం రూ. 308, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 312, మహారాష్ట్రలో రూ.317, దాద్రానగర్ హవేలీ, డామన్ దీవుల్లో రూ.340, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ.347 చొప్పున చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించింది. కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406 చొప్పున కూలీలకు రోజువారీ వేతనం చెల్లించనున్నారు.

సిక్కింలోని మూడు పంచాయతీలకు మాత్రం ప్రత్యేకంగా రూ.450 వేతనం నిర్ణయించారు. ఉపాధి హామీ పథకానికి గానూ 2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపట్టలేదు. వీబీ జీరామ్ జీ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో పెంపును వాయిదా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి తీసుకురావడంతో వేతన సవరణ చేపట్టింది. చివరిసారిగా గతేడాది మార్చి 27న ఈ వేతనాలను కేంద్రం సవరించింది. ఈ చట్టం అమలును ‘చారిత్రాత్మక, అపూర్వమైన’ ఘట్టంగా అభివర్ణిస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లక్షలాది గ్రామీణ కార్మికులకు సురక్షితమైన జీవనోపాధిని కల్పించడంలో ముందడుగు అని సంతోషం వ్యక్తం చేశారు.