2 July, 2026 | 1:16 AM

బంగ్లాలో హిందూ పూజారిపై దాడి

02-07-2026 12:24 AM
  1. బంధించి, చిత్రహింసలు పెట్టిన దుండగులు
  2. కుటుంబీకులకు, స్నేహితుడికి ఫోనలో డబ్బు డిమాండ్
  3. 26 వేల టాకాలు పంపిన తర్వాత రోడ్డుపై వదిలి పరార్

ఢాకా, జూలై1: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 25 ఏళ్ల హిందూ మతగురువు, న్యాయశాస్త్ర విద్యార్థిని గుర్తుతెలియని దుండుగులు అపహరించి, సోమవారం రాత్రంతా బందీగా ఉంచి, చిత్రహింసలకు గురిచేశారు. అతని కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు రోడ్డు పక్కన పడేసి పారారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని నరిందా ప్రాంతంలో స్నేహితులు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న సుభాష్ దేవురి గుర్తించి, ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు.

ఈ మేరకు స్థానిక మీడియా తెలిపింది. దేవురి ఢాకా సెంట్రల్ లా కాలేజీలో విద్యార్థి. గత కొన్ని నెలలుగా జగన్నాథ్ విశ్వవిద్యాలయం కేంద్ర దేవాలయంలో సహాయక పురోహితుడిగా పనిచేస్తూ, అక్కడ రోజువారీ మతపరమైన ఆచారాలను నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అపహరించి, గంటల తరబడి చిత్రహింసలు పెట్టి, అతని వస్తువులను దోచుకున్నారు. డబ్బు డిమాండ్ చేయడానికి బంధువులు, స్నేహితులకు ఫోన్ చేయమని బలవంతం చేశారని అతని సోదరి ఆరోపించారు.

తన సోదరుడి విడుదల కోసం ఒక అపరిచిత వ్యక్తి తనతో ఫోన్లో మాట్లాడి, 30,000 టాకాలు డిమాండ్ చేశాడని చెప్పింది. దుండగుల్లో ఒకరి ఫోన్ నంబర్‌కు 26,000 టాకాలు బదిలీ చేసింది. దుండగులు ఫోన్ చేసి, డబ్బు పంపమని ఒత్తిడి చేశారని దేవురి రూమ్మేట్ అయిన దుర్జోయ్ సాహా తెలిపాడు.

మంగళవారం తెల్లారుజామున  రోడ్డుపై సుభాష్ గాయాలతో పడి ఉండటాన్ని గుర్తించామని, అతని తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాని తెలిపాడు. అతని మొబైల్ ఫోన్, పర్సు కనిపించలేదని సాహా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు తనను శారీరకంగా, మానసికంగా హింసించినట్లు తెలిసింది. దుండగులు అతని బట్టలు విప్పేసి నగ్నంగా చేసి, వీడియోలు తీసి, అతని కుటుంబాన్ని డబ్బు అడగమని బ్లాక్మెయిల్ చేశారు.