20 June, 2026 | 9:34 PM

మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం

20-06-2026 08:21 PM

* పాఠశాలల నుంచే యోగ విద్యను ఏర్పాటు చేయాలి.

హైకోర్టులో పిల్ దాఖల్ చేసిన అడ్వకేట్ మరికంటి

గరిడేపల్లి,(విజయక్రాంతి): మత్తు రహిత పటిష్ట సమాజం నిర్మాణానికి యోగ ఒకటే మార్గం అని తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లాఫ్టర్ యోగ సొసైటీ వ్యవస్థాపకుడు ఖమ్మం నివాసి అడ్వకేట్ మరికంటి వెంకట్ అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యాసంస్థలలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యాభ్యాసం కేజీ టు పీజీ వరకు యోగ విద్యను ఒక విధిగా నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిఐఎల్) పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు.

గత 15 సంవత్సరాలుగా ఉచిత సేవ నిరంతరం తెలుగు రాష్ట్రాలలో వినూత్న పద్ధతులు ఉచిత శిక్షణ మరియు సాహిత్య ప్రచరణాలు ద్వారా యోగ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తున్న తన అనుభవాలను జోడిస్తూ ఆయన ఈ పిటిషన్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. సమాజానికి బలమైన పునాది వ్యక్తులేనని వ్యక్తులు శారీరకంగా మానసికంగా సామాజికంగా దృఢంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థతో పాటు సమాజం కూడా ప్రగతి పదంలో పయనిస్తుందని స్పష్టం చేశారు.

అభివృద్ధి అంటే కేవలం ఆస్తులు కూడా పెట్టడం వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ మాత్రమే కాదని పౌరుల అంతర్గత ఆనందం మానసిక ప్రశాంతత కూడా దేశాభివృద్ధిలో ప్రధాన భాగమేనని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుండి మనసును స్థిరంగా ఉన్నప్పుడే జీవితంలో సంతృప్తిని అలవాటుగా చేసుకున్నప్పుడే యోగా శాస్త్రం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఆందోళనకరంగా మారుతున్న బాల్య నేరాలు, డ్రగ్స్, సాంస్కృతి, కల్తీ మత్తు పదార్థాల వినియోగం మహిళలపై వేధింపులు మరియు దోపిడీలను అరికట్టడానికి చిన్నతనం నుంచే యోగ ద్వారా నైతిక విలువలను బోధించాల్సిన అవసరం ఉందన్నారు.