రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని రద్దు చేయాలి
క్యూఆర్ కోడ్ నిబంధనతో వాహనదారులపై మోయలేని ఆర్థిక భారం..
ఆటో డ్రైవర్లను, వాహన యజమానులను నిలువునా ముంచుతున్న నిబంధనలు..
చట్టంలో లేని నిబంధనలను గుట్టుగా అమలు చేయడంపై ఉద్యమిస్తాం
ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య
కొత్తగూడెం,(విజయక్రాంతి): రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఈ విధానం వల్ల ఆటో డ్రైవర్లతో పాటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టం కలుగుతున్నాయని ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెం పరిధిలోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శనివారం భారీ ధర్నా నిర్వహించి, అనంతరం ఆర్టీఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేకపోయినా రవాణా శాఖ వీటికి కొత్తగా క్యూఆర్ కోడ్ నిబంధనను చేర్చి ప్రైవేట్ కంపెనీల దోపిడీకి ఊతమిస్తోందని మండిపడ్డారు. గతంలో వాహనదారుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన రవాణా శాఖ, ఇప్పుడు మళ్లీ గుట్టుగా ఈ దోపిడీ విధానాన్ని అమలులోకి తెచ్చిందని విమర్శించారు. సాధారణ రిఫ్లెక్టివ్ టేపుల కంటే రెట్టింపు ధరలతో విక్రయిస్తూ, వాహనం చుట్టూ 22 మీటర్ల నుంచి 26 మీటర్ల వరకు టేపులను అతికించాలనే కొత్త నిబంధనతో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, లారీలు,
బస్సుల యజమానులపై వేలాది రూపాయల అదనపు భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి లాభం చేకూర్చడం కోసమే ఈ దోపిడీకి రంగాన్ని సిద్ధం చేశారని, తక్షణమే ఈ నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, చింటూ, సురేష్, మోహన్, శీను, సోను, స్వామి తదితరులు పాల్గొన్నారు.






