ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాంతినగర్, ఖమ్మంకు గర్వకారణం
ఖమ్మం,(విజయక్రాంతి): నిన్న ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన రెడ్ రిబ్బన్ క్లబ్ జాతీయ స్థాయి క్విజ్ పోటీలలో ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాంతినగర్, ఖమ్మంకు చెందిన బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని కుమారి దేవి శ్రీ ప్రసన్న 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.50,000 నగదు బహుమతి అందుకొని ఘన సన్మానం పొందింది.
ఈ సందర్భంగా ఖమ్మం 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ కామర్తపు మురళి కళాశాలలో విద్యార్థినిని ఘనంగా సన్మానించారు. దేవి శ్రీ ప్రసన్న సాధించిన ఈ విశిష్ట విజయం ఆమె కృషి, పట్టుదల, ప్రతిభ, అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. ఆమె సాధించిన ఈ ఘనత ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ అద్భుత విజయాన్ని సాధించిన దేవి శ్రీ ప్రసన్నకు, ఆమె తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రూపన గోవిందరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఎంఫీసీ మొదటి సంవత్సరం టాపర్ టి. వందనకు, సీఈసీ మొదటి సంవత్సరం టాపర్ ఎం. హేమకు పాఠ్యపుస్తకాలను అందజేశారు






