బోధన్ మున్సిపాలిటీని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ పామూరు సురేష్ గురువారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం బోధన్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలపై మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించారు.
పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా శాఖల పరిధిలోని సమస్యలు, పెండింగ్ పనులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.






