15 March, 2026 | 12:28 AM

పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ

14-03-2026 08:24 PM

- అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే..

కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం మొదటిరోజు కరీంనగర్లో ఓల్డ్ హై స్కూల్, ధన్గర్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేసి, పరీక్షల సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రథమ చికిత్స మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- మున్సిపల్ కమిషనర్ తనిఖీ..

సాయి కృష్ణ థియేటర్ సమీపంలో ఎస్సార్ డిజె స్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు తగిన సూచనలు చేశారు.