నాణ్యత లేని మాంసాన్ని విక్రయిస్తే చర్యలు
బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ హెచ్చరిక
బాన్సువాడ, జూన్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పశువైద్య ఆసుపత్రిలో పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో బుధవారం మాంసం విక్రయ దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యంగా ఉన్న మేకల మాంసాన్ని మాత్రమే విక్రయించాలని మాంసం దుకాణదారులకు సూచించారు.
అనారోగ్యానికి గురైన లేదా నాణ్యత లేని మాంసాన్ని విక్రయించకుండా నిబంధనలు పాటించాలని కోరారు. పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ మాంసం విక్రయానికి ముందు పశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో గంగారం, మాంసం విక్రయ దుకాణదారులు హుస్సేన్, గణేష్, శంకర్, నర్సుజీ తదితరులు పాల్గొన్నారు.






