23 May, 2026 | 7:48 PM

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 700 ఎకరాలు

04-11-2025 01:26 AM

-భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ కోసం ఆదిలాబాద్‌లో 700 ఎకరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రానున్న రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరంగల్‌లోని మామానూరు విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన భూసేకరణ పూర్తి కావొచ్చింది.

ఇక్కడ అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆదిలాబాద్‌లోనూ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలపడంతో ఏఏఐ రాబోయే రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది.