26 May, 2026 | 1:23 AM

హత్య కేసులో నిందితుడికి జీవిత కారాగార శిక్ష

26-05-2026 12:25 AM

అర్మూర్, మే 25 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జీవిత కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో వెల్లడించారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామానికి చెందిన సుద్ద లక్ష్మి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021 ఆగస్టు 27న ఉదయం సుమారు అయిదు గంటల సమయంలో బుస్సాపూర్ బస్టాండ్ సమీపంలోని హోటల్ వద్ద మృతుడు సుద్ద లింగన్న టీ తాగుతూ ఉండగా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో నిందితుడు సోమ నవీన్, బొర్రయ్య మోటార్ సైకిల్కు నిప్పు పెట్టారు.

దీనిపై లింగన్న బొర్రయ్యను ప్రశ్నించగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిందితుడు చంపేస్తానంటూ  బెదిరించి అక్కడి నుండి వెళ్లి గొడ్డలి, కొంకి తీసుకొచ్చి లింగన్నపై దాడి చేశాడు. దాడిలో లింగన్న తీవ్ర రక్తగాయాలకు గురికాగా , వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ లింగన్న మృతి చెందాడు. ఈ ఘటనపై మెండోరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు రెండవ అడిషనల్ సెషన్ జడ్జ్ ఎస్.నారాయణ విచారణ అనంతరం నిందితుడు సోమ నవీన్@నవీన్ రెడ్డిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి జీవిత కారాగార శిక్షతో పాటు రెండు వేల  జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీపీ వివరించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, మొదటి ఐ.ఓ, మెండోరా ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి, రెండవ ఐ.ఓ, గత అర్మూర్ ఏసీపీ  వి.రఘు, ప్రస్తుత ఎస్త్స్ర సుహాసిని జాదవ్, లైసెన్ ఆఫీసర్ గోవిందు, కో డ్యూటీ ఆఫీసర్ శ్రీరామోజు రాజు,  సాగర్, విక్రమ్ లను సీపీ అభినందించారు.