ప్రేమ పేరుతో వేధింపులు
యువతి తల్లిని హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
శేరిలింగంపల్లి, జూలై 30 (విజయక్రాంతి): ప్రేమ వ్యవహారంలో యువతిని వేధిస్తూ, ఆమె తల్లిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 డిసెంబర్ 13న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుడు యెద్దు సందీప్ కుమార్ అలియాస్ బబ్లూను దోషిగా తేల్చింది.
నిందితుడికి హత్య నేరానికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, హత్యాయత్నం నేరానికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన నేరానికి మూడు నెలల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని పన్నెండో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి టి. అనిత తీర్పు వెలువరించారు.
పోలీసుల వివరాల ప్రకారం, యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఆమెపై అనుమానాలు వ్యక్తం చేసిన నిందితుడు, కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోలేదు. యువతి కుటుంబం హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆమె వివాహ నిశ్చయమైందని తెలుసుకున్న నిందితుడు కక్ష పెంచుకొని ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి శోభ తీవ్రంగా గాయపడి మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందగా, యువతి కూడా గాయపడింది. అనంతరం నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స అనంతరం పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.






