చెంచు కుటుంబాలతో హెచ్‌ఆర్సీ కమిషన్ ముఖాముఖి
చెంచుల జీవనంపై ఆరా శ్రీశైలం డ్యాం ప్రభుత్వ పాఠశాల తనిఖీ
అచ్చంపేట, ఆగస్టు 5 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మల్లయ్య పెంట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ చెంచు గిరిజన కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచు కుటుంబాల జీవనోపాధి, విద్య, వైద్యం, తాగునీరు, రహ దారులు, గృహాలు, రేషన్, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు తదితర సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
మహిళలు, వృద్ధులు, యువత తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి చెంచు కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
చెంచు గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్య, వైద్యం, పోషకాహారం, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.
అంతకు ముందు అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరిలోని శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా విద్యార్థులకు విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వారి వెంట డిఇఓ రమేష్ కుమార్ ఉన్నారు.






