రెచ్చిపోతున్న ఆధార్ ఆపరేటర్లు!
విద్యార్థుల ఉచిత ఎంబియూ కోసం రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు
ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు
పినపాక ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఉచితంగా అందించాల్సిన ఆధార్ సేవలు పినపాక మండలంలో వ్యాపారంగా మారిపోయాయి. పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా జరగాల్సిన మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఏంబియూ) ప్రక్రియను ఆసరాగా చేసుకుని, కొంతమంది ఆధార్ ఆపరేటర్లు తల్లిదండ్రుల నుంచి నిలువుదోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగింది?
విద్యార్థుల ఆధార్లలో బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం ప్రభుత్వం ‘సమగ్ర శిక్ష‘ ద్వారా ప్రత్యేక పాఠశాల స్థాయి ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. నిబంధనల ప్రకారం 5 నుంచి 7 ఏళ్లు, అలాగే 15 నుంచి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులకు మాండేటరీ అప్డేట్ జరగాల్సి ఉంది.
సేవలు పూర్తిగా ఉచితం
అయితే పినపాక మండల పరిధిలోని పలు పాఠశాలల్లో ఉచితంగా చేయాల్సిన ఈ పనికి, కొందరు ఆధార్ ఆపరేటర్లు అక్రమంగా రూ 100 నుంచి రూ 150 వరకు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘స్కూల్లోనే ఆధార్ ఉచితంగా అప్డేట్ చేస్తారని చెబితే పిల్లలను తీసుకెళ్లాం. కానీ అక్కడ ఉన్న ఆపరేటర్ డబ్బులు ఇస్తేనే పని అవుతుందని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది.‘
బాధిత విద్యార్థి తండ్రి
పరిశీలనలో తేలిన ముఖ్యమైన అంశాలు
అధికారిక నిబంధనలు విస్మరణ:
ప్రభుత్వం ఆధార్ క్యాంపుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని సమగ్ర శిక్ష ద్వారా భరిస్తున్నప్పటికీ, స్థానిక ఆపరేటర్లు అదనపు దందాలు కొనసాగిస్తున్నారు.
గుర్తించిన ఆపరేటర్ పై విమర్శలు:
ఈ మొత్తం అక్రమ వసూళ్ల వ్యవహారంలో పినపాక మండలంలో పనిచేస్తున్న ఓ నిర్దిష్ట ఆధార్ ఆపరేటర్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
రసీదులు లేని వసూళ్లు:
తల్లిదండ్రుల నుంచి రూపాయికి రసీదు కూడా ఇవ్వకుండా నగదు రూపంలోనే డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం.
అధికారుల సమగ్ర విచారణకు డిమాండ్
స్కూల్ క్యాంపుల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాపై విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా ఐటీడీఏ / ఆధార్ నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు, తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, సదరు ఆధార్ ఆపరేట్ప చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా వసూలు చేసిన సొమ్మును తిరిగి తల్లిదండ్రులకు చెల్లించేలా చూడాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మండల వ్యాప్తంగా ఆధార్ సేవలపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
డబ్బులు వసూలు విషయం నా దృష్టికిరాలేదు
మండలంలో విద్యార్థులకు మ్యాన్డేటరీ అప్డేట్ ఉచితంగా చేయాలని. సర్వ శిక్ష అభియాన్ ద్వారా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి అప్డేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆధార్ కేంద్రాల్లో ఆపరేటర్లు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానన్నారు.
- ఎం ఈ ఓ కే. నాగయ్య






