26 April, 2026 | 1:51 AM

దిమ్మదిమ్మకో జీ‘వన’ గ‘మనం’!

26-04-2026 12:17 AM
  1. అడవిలో రోడ్ల వెంట ప్రకృతి చైతన్యం
  2. అటవీశాఖ వినూత్న ప్రచారం

‘కొమ్మకొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి.. ఏమిటీ మౌనం.. ఏమిటీ రాగం..’, ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవారు సృష్టికే అందాన్ని తెచ్చినారు’ మధురమైన పాటల మాదిరి.. అడవిలో దిమ్మదిమ్మకో జీ‘వన’ చిత్రాలు గీసినారు.. జీవవైవిధ్య గమనాన్ని చాటినారు అటవీ అధికారులు. అడవులు, వన్య ప్రాణుల పరిరక్షణ కోసం అటవీశాఖ మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల పరిధుల్లో  అడవిలో రోడ్ల వెంట ప్రకృతి చైతన్యం కల్పించేలా వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రహదారుల వెంట ప్రయాణించే ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు దిమ్మలపై చిత్రాలను చూసి ఆకర్షితులవడమే కాకుం డా, వాటిలో ఉన్న సందేశాన్ని గ్రహిస్తూ పర్యావరణ పరిరక్షణపై ఆలోచిస్తున్నారు. విద్యార్థులు, యువతలో కూడా ప్రకృతి పట్ల ఆసక్తి పెంపొం దించడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తోంది. జంతు ప్రేమికులు, వన ప్రేమికులు, పర్యావరణ కార్యకర్తలు అటవీశాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు.

అడవుల సంరక్షణతో పాటు ప్రజల్లో పర్యావరణ చైత న్యం పెంపొందించడమే లక్ష్యంగా అటవీశాఖ కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల పరిధుల్లో తీసుకుంటున్న ఈ వినూత్న కార్యక్రమం అడవుల్లో కొత్తదనాన్ని తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు అటవీ ప్రాంతాల్లో సరిహద్దుల గుర్తిం పు కోసం హద్దురాళ్లు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండగా, ఇప్పుడు కొత్తగా హద్దురాళ్లకు బదులు ఇటీవల అటవీ రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రహదారి పక్కన సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేసి వాటిపై వన్యప్రాణుల చిత్రాలను గీయిస్తున్నారు.

అటు అటవీ శాఖ హద్దులను నిర్ధారించడంతోపాటు, ఇటు సిమెంట్ దిమ్మలపై ఆకర్షణీయమైన ఆయిల్ పెయింట్ రంగులతో, కళాత్మకంగా వన్య ప్రాణుల 3డీ ఎలివేషన్ చిత్రాలను రూపొందించడం ద్వారా వన్యప్రాణులు, పక్షులు, అడవుల అందం, జీవవైవిధ్యం వంటి అంశాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ చిత్రాలు కేవలం అలంకరణ కోసమే కాకుండా, ప్రతి ఒక్కరికీ సందేశాన్ని అందించే విధంగా రూపొందిస్తున్నారు.

అడవిలో జీవించే జంతువుల ప్రాధాన్యం, వాటి సంరక్షణ అవసరం, మనుషు లు, జంతువుల మధ్య సమతుల్యత, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర వంటి విషయాలను చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు తీసుకున్న ఈ సృజనాత్మక కార్యక్రమం ద్వారా ప్రజల్లో వన్యప్రాణుల పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అడవుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మా త్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అనే అవగాహనను ఈ కార్యక్రమం బలంగా నాటుతోంది.

భవిష్యత్ తరాలకు సుసంపన్నమైన జీవవైవిధ్యాన్ని అందించాలంటే ఇప్పటి నుంచే సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ దిమ్మలు గుర్తుచేస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా, రహదారుల వెంట ప్రయాణించే ప్రజలు ఈ చిత్రాలను చూసి ఆకర్షితులవుతుండటమే కాకుండా, వాటిలో ఉన్న సందేశాన్ని గ్రహిస్తూ పర్యావరణ పరిరక్షణపై ఆలోచించేలా మారుతున్నారు. విద్యార్థులు, యువతలో కూడా ప్రకృతి పట్ల ఆసక్తి పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తోంది.

జంతు ప్రేమికులు, వన ప్రేమికులు, పర్యావరణ కార్యకర్తలు అటవీశాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ, ఇటువంటి వినూత్న చర్యలు మరిన్ని ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని సూచిస్తున్నారు. అటవీశాఖ అధికారులు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా, సమాజంలో చైతన్యం తీసుకురావడంలోనూ ముందుండటం ప్రశంసనీయం అని పలువురు అభినందిస్తున్నారు.

కొత్తగూడ అటవీ రేంజ్ పరిధిలో అటవీశాఖ చేపడుతున్న ఈ దిమ్మల నిర్మాణం, వాటిపై కళాత్మక అవగాహన చిత్రాల రూపకల్పన పర్యావరణ పరిరక్షణకు ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఈ కార్య క్రమం ద్వారా ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం భవిష్యత్‌లో అడవుల సంరక్షణకు బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. అటవీ ప్రాంతాలు పచ్చదనంతో పాటు ఆలోచింపజేసే ప్రకృతి చిత్రాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

 బండి సంపత్‌కుమార్,

మహబూబాబాద్, విజయక్రాంతి

వన్యప్రాణుల ప్రాధాన్యం, జీవవైవిధ్యం, ప్రకృతి సమతుల్యతే లక్ష్యం

అడవుల సంరక్షణ కేవలం చట్టపరమైన చర్యలతో మాత్రమే సాధ్యం కాదు. ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే రహదారి పక్కన నిర్మిస్తున్న దిమ్మలను ఒక అవగాహన వేదికగా మలచాలని భావించాం. ఈ చిత్రాల ద్వారా వన్యప్రాణుల ప్రాధాన్యం, జీవవైవిధ్యం, ప్రకృతి సమతుల్యత వంటి అం శాలను ప్రజలకు చేరవేయాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా గిరిజనులు, గ్రామీణ ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలను రూపొందించాం.

ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని యోచిస్తున్నాం. గతంలో కేవలం అటవీశాఖ హద్దులను గుర్తించే విధంగా మాత్రమే హద్దురాలను ఏర్పాటు చేసే వారం. ఇప్పుడు వాటికి బదులు సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేసి, వాటి పై హద్దులను నిర్ణయించడంతోపాటు వన్యప్రాణుల చిత్రాలను గీయించడం వల్ల రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. 

 వి.చంద్రశేఖర్, ఫారెస్ట్ అధికారి, గూడూరు