1 May, 2026 | 2:22 AM

గ్లోబల్ స్థాయికి వెయ్యి వ్యాపారాలు

01-05-2026 01:02 AM
  1.   2027 మార్చి 31 నాటికి తీసుకెళ్లడమే లక్ష్యం
  2. అంతర్జాతీయ వేదికలతో కొత్త అవకాశాలు
  3. వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు వినియోగించుకోవాలి
  4. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  5. ‘ఎక్స్‌ఫ్లోర్ టూ ఎక్స్‌ప్యాండ్’ లోగో ఆవిష్కరణ
  6. మే 21 వరకు సింగపూర్‌లో తొలి అంతర్జాతీయ మిషన్ ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): 2027 మార్చి 31 నాటికి వెయ్యి వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘ఎక్స్‌ఫ్లోర్ టూ ఎక్స్‌ప్యాండ్’ అంతర్జాతీయ వేదిక ఎంతో దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా తెలంగాణలోని వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు, స్టార్టప్‌లు, నిపుణులు అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించి ప్రపంచ స్థాయిలో విస్తరించే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

గురువారం సచివాలయంలో ‘ఎక్స్‌ఫ్లోర్ టూ ఎక్స్‌ప్యాండ్’ అంతర్జాతీయ వేదిక లోగోను మం త్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి అంతర్జాతీయ వేదికలు వ్యాపారవేత్తలకు, ఎగుమతిదారులకు, యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని తెలిపారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా నిలబెట్టడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యాపారులు, ఎగుమతిదా రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తున్న సందీప్ కుమార్ మక్తాలాను మంత్రి అభినందిస్తూ తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చేర్చే మంచి ప్రయత్నమని ప్రశంసించారు. ఎక్స్‌ఫ్లోర్ టూ ఎక్స్‌ప్యాండ్ అనేది అంతర్జాతీయ మార్కెట్లను పరిచయం చేసే ఒక సమగ్ర కార్యక్రమం. ఇందులో బిజినెస్ డెలిగేషన్లు, ఎగుమతి ప్రోత్సాహక పర్యటనలు, విద్యా ర్థుల గ్లోబల్ ఎక్స్‌పోజర్ ప్రోగ్రాంలు, ఇంటర్న్షిప్ అవకాశాలు, వ్యూహాత్మక నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ వేదిక స్థానిక ప్రతిభను అంతర్జాతీయ అవకాశాలతో అనుసంధానించే వంతెనగా పనిచేస్తుంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థికాభివృద్ధి దిశగా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి అంతర్జాతీయ మిషన్ సింగపూర్‌లో మే 21 నుండి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో వ్యాపార అవకాశా లు, భాగస్వామ్యాలు, అంతర్జాతీయ నెట్‌వర్కింగ్, మార్కెట్ అవగాహనపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

తదుపరి దశలో ఇతర దేశాల్లో కూడా ఇలాంటి మిషన్లు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ సిరీస్‌గా విస్తరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టీ కన్సల్ట్ డైరెక్టర్ భాగ్య లక్ష్మి వాకిటి, సెక్రటరీ యామిని మద్దుకూరి, కేశవ్ సోని పాల్గొన్నారు. నమోదు, వివరాలకు 81231 23434, 8019577575 లేదా bit.ly/exp lore2expand లో సంప్రదించవచ్చు.