1 May, 2026 | 4:10 AM

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

01-05-2026 01:04 AM

వారం రోజుల్లోనే చిన్నారి జ్యోత్స్నకు హార్ట్ సర్జరీ చేయించి జీవితంలో వెలుగులు నింపిన ప్రజానాయకుడు

దమ్మపేట, ఏప్రిల్ 30, (విజయక్రాంతి): ఇచ్చిన మాట నిలబెట్టుకొని చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి ఆమె జీవితంలో వెలుగులు నింపిన ప్రజానాయకుడు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన మల్కాపురం నాగులు కుటుంబానికి చెందిన చిన్నారి జ్యోత్స్న చాలా కాలంగా తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటోంది.

చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పలు వైద్యులను సంప్రదించినప్పటికీ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించగా, లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలియడంతో ఆ పేద కుటుంబం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. చివరి ఆశగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణని ఆశ్రయించారు. గండుగులపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి వివరించారు.

చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే చలించిపోయారు. ఏ మాత్రం ఆందోళన చెందకండి& మీకు నేను అండగా ఉంటాను& చిన్నారికి తప్పకుండా వైద్యం చేయిస్తాం అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి చిన్నారి వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అత్యవసరంగా రెండు లక్షల రూపాయల LOC మంజూరు అయ్యేలా కృషి చేశారు.

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఫైల్ ప్రక్రియను వేగవంతం చేయించడంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే సహాయం అందేలా చేశారు. ఆర్థిక సహాయం అందిన వెంటనే చిన్నారిని హైదరాబాద్లోని ప్రముఖ నిమ్స్ ఆసుపత్రికి తరలించి, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో హార్ట్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో చిన్నారి ప్రస్తుతం కోలుకుంటూ ఆరోగ్యంగా ఉంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఎమ్మెల్యే  మాకు దేవుడిలా అండగా నిలిచారు. ‘నేనున్నాను’ అన్న మాటను నిలబెట్టి మా బిడ్డకు కొత్త జీవితం ఇచ్చారు అంటూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి జ్యోత్స్నకు విజయవంతంగా శస్త్రచికిత్స జరగడం పట్ల మొద్దులగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.