3 July, 2026 | 11:22 AM

విద్యుత్ అధికారుల దౌర్జన్యం.!

03-07-2026 10:21 AM

ట్రీ కటింగ్ పేరుతో రైతు పొలంలోని 18 భారీ టేకు వృక్షాల తొలగింపు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మండలం ఎండబెట్ల గ్రామ శివారులో విద్యుత్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సేవకుల బుచ్చన్నకు చెందిన వ్యవసాయ పొలం (సర్వే నంబర్ 46)లో సుమారు 20 ఏళ్ల క్రితం నాటిన 18 భారీ టేకు వృక్షాలను విద్యుత్ లైన్‌కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో జేసీబీ సహాయంతో నేలకూల్చారు. 

 రైతుల కథనం ప్రకారం, బుధవారం రాత్రి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అధికారులు ట్రీ కటింగ్ పేరుతో కొమ్మలు మాత్రమే తొలగించాల్సీ ఉండగా భారీ టేకు వృక్షాలను జేసీబీ సహాయంతో తొలగించారు. శుక్రవారం ఉదయం రైతులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా అన్ని టేకు వృక్షాలు నేలకూలి ఉండటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విద్యుత్ అధికారులను సంప్రదించగా, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించి వృక్షాలను తొలగించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత రైతుకు తగిన న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.