calender_icon.png 14 February, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగారూలకు దిమ్మతిరిగే షాక్

14-02-2026 12:06:03 AM

జింబాబ్వే సంచలన విజయం

కొలంబో, ఫిబ్రవరి, ౧౩ : టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగాటోర్నీలో అదరగొడుతున్న చిన్న జట్లలో ఏదో ఒకటి పెద్ద జట్టుకు షాకివ్వడం ఖాయమని అంచనా వేశారు. ఆ అంచనాలను నిజం చేస్తూ జింబాబ్వే, ఆస్ట్రేలియాను ఓడించింది. నిజానికి ఒకప్పుడు జింబాబ్వే కూడా మంచి జట్టే కానీ ఆదేశ ఆర్థిక పరిస్థితుల కారణంగానూ, పలువురు ఆటగాళ్లు రిటైరయిపోవడం, వేరే దేశాలకు వెళ్లిపోవడంతో అసోసియేట్ దేశాల స్థాయికి పడిపోయింది.

అయినప్పటకీ అప్పుడప్పుడూ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే ఆటతీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం అంటే గొప్ప ఘనతగానే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు.

కీలకబౌలర్లు గాయాలతో దూరమ వడంతో బలహీనంగా ఉన్న ఆసీస్ బౌలిం గ్ ఎటాక్‌ను చాలా ఈజీగా ఎదుర్కొని పరుగులు సాధించారు. 8 ఓవర్ల వరకూ జింబాబ్వే వికెట్ కోల్పోలేదంటూ కంగారూల బౌలింగ్ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెన్నెట్ ఆసీస్ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 7 ఫోర్లతో 64 పరుగులు చేయగా.. మరుమని(35) పరుగులతో రాణించాడు. తర్వాత ర్యాన్‌బర్ట్(35), సికిందర్‌రాజా (25) పరుగులు చేశారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసింది.

ఆసీస్ బౌలర్లలో డ్వార్షియిస్, నాథన్‌ఎల్లిస్, ఆడమ్‌జంపా పెద్దగా ప్రభా వం చూపలేకపోయారు. 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభం నుంచే తడబడింది. ఇంగ్లీస్(8), హెడ్(17) పరుగులకే ఔటవగా.. కామెరూన్ గ్రీన్(0), టిమ్ డేవిడ్ (0) డకౌటయ్యారు. ఈ దశలో మాక్స్ వెల్, రెన్షా నిలదొక్కుకోవడంతో ఆసీస్ గెలుస్తుందనుకున్నారు. కానీ మాక్స్‌వెల్ (35) రన్స్‌కు ఔటైన తర్వాత ఆసీస్ ఇన్నిం గ్స్ మళ్లీ గాడి తప్పింది.

వరుసగా వికెట్లు కోల్పోయింది. రెన్షా హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచినప్పటకీ(65) జట్టును గెలిపించలేకపోయాడు. జింబాబ్వే అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ లోనూ చురుగ్గా కదిలింది. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ 4, ఎవాన్స్ 3 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టారు. ఈ విజయంతో జింబాబ్వే గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ మూడో స్థానానికి పరిమితమైంది. సూపర్ 8 చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో కంగారూలు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.