గెస్ట్‌హౌస్‌కు కొత్త రూపు
- రూ.3.13 కోట్లతో టెండరు
- ముమ్మరంగా పనులు
కేసముద్రం, మే 12 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి చొరవతో శిథిలావస్థకు చేరుకున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు మోక్షం లభించింది. కేసముద్రం పట్టణ అభివృద్ధిలో భాగంగా పాత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను తొలగించి కొత్తది నిర్మించడానికి గత ఏడాది సెప్టెంబర్ 24న ప్రభుత్వం ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.
అదే ఏడాది నవంబర్ 21న ఆర్ అండ్ బి సీ.ఈ ద్వారా సాంకేతిక అనుమతి ఇప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న టెండర్లు నిలిచి అగ్రిమెంట్ చేశారు. 2.99 కోట్ల రూపాయల వ్యయంతో కాంట్రాక్టు అంచనా వేయగా గుత్తేదారు 4.57 శాతం అధికంగా టెండర్ దాఖలు చేసిన నేపథ్యంలో 3.13 కోట్ల రూపాయల వ్యయంతో పనులను ఖరారు చేశారు.
18.14 గుంటల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో 9,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించారు. కొత్తగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, పోర్టికో, సర్వెంట్ క్వార్టర్, నాలుగు సూట్ రూములు, మీటింగ్ హాల్, కిచెన్ తోపాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించ తలపెట్టారు. మొత్తంగా 4,004 చదరపు అడుగుల్లో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మిస్తుండగా, 252 చదరపు అడుగుల పోర్టికో నిర్మించ తలపెట్టారు.
అలాగే 800 చదరపు అడవుల్లో సర్వెంట్ క్వార్టర్ నిర్మిస్తారు. ఒకప్పుడు సభలు, సమావేశాలు, ప్రముఖులు వచ్చినప్పుడు కేసముద్రంలో బస చేయడానికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వేదికగా నిలిచేది. కార్యక్రమంలో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ క్రమక్రమంగా దెబ్బతిని, వినియోగానికి దూరమైంది.
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తన సొంత మండలం కేసముద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను తొలగించి ఆ స్థానంలో కొత్తది నిర్మించడానికి చర్యలు చేపట్టి, నిధులు మంజూరు చేయించడంతోపాటు పనులు కూడా చేపట్టే విధంగా కృషి చేశారు. దీనితో కేసముద్రం మున్సిపాలిటీకి నూతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.






