22 July, 2026 | 3:28 AM

సీఎం నటించిన సినిమా.. ఈతరం ప్రేక్షకులకు అరుదైన అవకాశం

22-07-2026 02:30 AM

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్ నుంచి వస్తున్న సినిమా ‘జన నాయకుడు’. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మించారు. ఈ చిత్రం జూలై 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కే నారాయణ సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. “ఇది నా తొలి తమిళ సినిమా. విజయ్ మేనేజర్‌తో ‘లియో’ సమయంలో మాట్లాడితే, ‘గోట్’ తర్వాత విజయ్ మరో సినిమా చేయబోతున్నారని తెలిసింది. దానికి నేనే నిర్మాతగా ఉంటానని చెప్పాను.

తర్వాత ఒక్క మీటింగ్‌లోనే ఈ సినిమా ఓకే అయింది. రిలీజ్ సమయంలో థియేటర్స్ విషయంలోనే కొన్ని అడ్డంకులు రావచ్చని భావించాం. రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు.. ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని అసలు ఊహించలేదు. ఏదేమైనా ఈ తరం ప్రేక్షకులకు ఒక సీఎం నటించిన సినిమాను థియేటర్‌లో చూసే అవకాశం రావడం చాలా అరుదు. కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికీ మెమొరబుల్ మూమెంట్.

విజయ్ సినీ ప్రయాణానికి ఓ ట్రిబ్యూట్‌లా ఉండేలా సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం విజయ్ దృష్టంతా ప్రజా సేవపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో మరో సినిమా చేయాలని ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే చాలా అభిమానం. ఆయన ప్రయాణం నాకు స్ఫూర్తి. ఇప్పుడు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.