13 March, 2026 | 7:56 AM

వీధి దీపాల నిర్వహణకు రూ.1,341 కోట్లు

13-03-2026 01:20 AM

7.60 లక్షల ఎల్‌ఈడీ దీపాల కోసం పదేళ్ల భారీ ప్రాజెక్టు

సర్కారు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): నగర వీధులను వెలుగులతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న సుమారు 7.60 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల సంపూర్ణ నిర్వహణ కోసం ఏకంగా రూ.1,341.60 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ 91 జారీ చేసింది.

పదేళ్ల సుదీర్ఘ కాలానికి అప్పగించే ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలోని ప్రతి గల్లీలో వెలుగులు నింపడమే కాకుండా, ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే సమస్యను పరిష్కరించేలా కఠిన నిబం ధనలు విధించింది. ఇందుకు సంబంధించి అత్యల్ప ధర కోట్ చేసిన కాకతీయ ఎనర్జీ సిస్టమ్స్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది.కాగా గతంలో ఎల్‌ఈడీ వీధి దీపాల ప్రాజెక్టును నిర్వహించిన ఈఈఎస్‌ఎల్ సంస్థ ఒప్పందం గతేడాది ఏప్రిల్తో ముగిసింది.

అప్పటి నుంచి తాత్కాలికంగా కొనసాగుతున్న నిర్వహణ పనులకు స్వస్తి పలికి, ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన కొత్త ఏజెన్సీని ప్రభుత్వం రంగంలోకి దించుతోంది.పాత వ్యవస్థలో ఉన్న లోపాలను సవరిస్తూ.. కేబుల్స్ మార్పిడి, వాహనా ల లభ్యత, రియల్ టైమ్ ఐటీ మానిటరింగ్ వంటి అంశాలను కొత్త ఒప్పందంలో చేర్చారు.కొత్తగా ఎంపికైన సంస్థ బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలోనే 7.60 లక్షల వీధి దీపాల్లో కనీసం 72 శాతం దీపాలను 24,840 సీసీఎంఎస్ బాక్సులను కొత్త వాటితో మార్చాల్సి ఉంటుంది.

ప్రతి దీపాన్ని పర్యవేక్షిస్తాం..

మొత్తం 8,733 కిలోమీటర్ల పొడవైన కేబుల్ నెట్వర్క్, 4 లక్షల విద్యుత్ స్తంభాల నిర్వహణ బాధ్యత కూడా సదరు సంస్థదే. ప్రతి దీపానికి నెలకు రూ. 186 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, సేవల్లో ఏమాత్రం జాప్యం జరిగినా భారీ జరిమానాలు విధించేలా పెనాల్టీ నిబంధనలు చేర్చ డం విశేషం. సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి దీపాన్ని పర్యవేక్షిస్తాం అని ప్రత్యే క ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఈ పనులను సమన్వయం చేసుకుని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.