2002 సేల్ అగ్రిమెంట్ ప్రకారం కల్యాణ మండపం నిర్మించాలి
- టీటీడీ భూమిని పరిశీలించిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్
చిట్యాల, ఆగస్టు 9 : చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో టీటీడీ కల్యాణ మండపం ఏర్పాటుకు 2002లో చేసుకున్న సేల్ అగ్రిమెంట్ ప్రకారం 1.12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే కల్యాణ మండపం నిర్మించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గల భువనగిరి రోడ్డులోని ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రజల విరాళాలు, సహకారంతో కొనుగోలు చేసిన ఈ భూమిని ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సి ఉందన్నారు.
ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మున్సిపల్ పాలకవర్గంపై ఉందన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఆధ్వర్యంలో స్థలాన్ని సర్వే చేసి, టీటీడీ అధికారులకు రిజిస్ట్రేషన్ కోసం నివేదిక సమర్పించారని తెలిపారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థలంలో ’కల్యాణ మండపం కోసం కేటాయించిన స్థలం’ అనే బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2002 సేల్ అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, కల్యాణ మండపం నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్‌ఎస్ నాయకులు జమాన్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బల శివశంకర్ రెడ్డి, జిట్ట బొందయ్య, కౌన్సిలర్లు నిమ్మనగోటి శ్రీనివాస్, షేక్ షబానా అజీముద్దీన్, సింగిల్ విండో డైరెక్టర్ కన్నెబోయిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






