మధుర జ్ఞాపకాలతో మార్గదర్శి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గురువులకు ఘన సన్మానం.. పాత మిత్రుల కలయికతో వెల్లివిరిసిన ఆనందం
గురువుల ఆశీస్సులు తీసుకున్న 2000–2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు
మంథని, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి దూరంగా ఉన్న స్నేహితులంతా ఒక్కచోట చేరడంతో మంథని పట్టణంలోని మార్గదర్శి విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా మారింది. 2000–2001 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
గురువులే తమ జీవితాలకు మార్గదర్శకులు అంటూ పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంలో గురువులు అందించిన విద్య, క్రమశిక్షణ, విలువలు ఎంతో కీలకమని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.
ఎన్నో ఏళ్ల తర్వాత మిత్రులంతా ఒకేచోట కలుసుకోవడంతో చిన్ననాటి జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు కదలాడాయి. పాఠశాలలో కలిసి చదువుకున్న రోజులు, తరగతి గది అనుభవాలు, ఆటపాటలు, ఉపాధ్యాయులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ తమ ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు కాలం గడిచినా చెక్కుచెదరవని ఈ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది.
భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకుంటూ పాత స్నేహబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మార్గదర్శి విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






