చెన్నై లవ్ స్టోరీ కల్ట్ లవ్ స్టోరీ
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డా. లవ్ స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా వెళ్లరా అని భయపడ్డా. మెల్లిగా ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ చెన్నై లవ్ స్టోరీతో మరో కల్ట్ లవ్ స్టోరీ ఇండస్ట్రీకి ఇచ్చారు. చెన్నై లవ్‌స్టోరీలో నేను కోరుకునే ప్రేమకథను చూశాను. పరిణితితో రాసిన ప్రేమకథ ఇది. కిరణ్ అబ్బవరం అడ్డంకులన్నీ దాటుకుని తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఈ సినిమా గౌరికి టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో గౌరి చేసిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి” అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూస్తున్నారు. అంతా మూవీకి కనెక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మా క్యారెక్టర్స్ కు రిలేట్ అవుతున్నారు. నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్” అని తెలిపారు. హీరోయిన్ శ్రీగౌరిప్రియ మాట్లాడుతూ.. “నాకు నిజమైన కెరీర్ ఇచ్చిన చిత్రమిది. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూపిస్తున్న ఇంత ప్రేమను ఊహించలేకపోయాం” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, స్టోరీ రైటర్ సాయి రాజేశ్, డైరెక్టర్ రవి నంబూరి, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌తోపాటు పలువురు చిత్రబృందం కూడా మాట్లాడారు.






