8 August, 2026 | 2:14 AM

‘మిషన్ భగీరథ’కు దశాబ్ది

08-08-2026 01:02 AM
  1. దేశానికే ఆదర్శంగా పథకం
  2. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోంది
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణ తాగునీటి విప్లవం.. ప్రతి ఇంటికీ సురక్షిత, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మిషన్ భగీరథకు నేటితో పదేళ్లు పూర్తి కావడం సంతోషకరమని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం ప్రజల తాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచి, దేశానికి రోల్ మోడల్‌గా ప్రసిద్ధి చెంది, హర్ ఘర్ జల్ పథకం అయిందని కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లోగా హరీశ్‌రావు స్పందించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు.  ఈ దుస్థితిని మార్చేందుకే కేసీఆర్  సమగ్ర తాగునీటి గ్రిడ్‌ను నిర్మించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నేడు మిషన్ భగీరథ పథకానికి శాపంగా మారిందని ఆరోపించారు. పథకాలను రాజకీయకక్షలకు బలిచేయొద్దని, మిషన్ భగీరథను నిర్లక్ష్యం చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అని అన్నారు.