16 July, 2026 | 12:22 AM

10 గంటల క్లిష్ట శస్త్రచికిత్స

16-07-2026 12:02 AM

అరుదైన కణితి తొలగించిన కిమ్స్ వైద్యులు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఎనిమిదేళ్లుగా ఫంక్షనింగ్ ప్యారాగాంగ్లియోమా అనే అరుదైన న్యూరోఎండోక్రైన్ కణితితో బాధపడుతున్న మహిళకు హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ వైద్యులు సుమారు 10 గంటలపాటు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కణితిని పూర్తిగా తొలగించారు. ఈ విషయాన్ని కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, జీఐ అండ్ హెచ్‌పీబీ ఆంకాలజిస్ట్, మెటబాలిక్ అండ్ రోబోటిక్ సర్జన్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రావుల ఫణి కృష్ణ వెల్లడించారు.

క్లోమ గ్రంథి వెనుక భాగంలో ఉండి సీలియాక్ ట్రంక్, సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ (ఎస్‌ఎంఏ), పోర్టల్ వెయిన్, అయోర్టా వంటి ప్రధాన రక్తనాళాలకు అతుక్కుపోయిన కణితిని ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే వాస్క్యులర్ రీకన్‌స్ట్రక్షన్ సాంకేతికతతో విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, అధిక రక్తపోటు కోసం వాడుతున్న మందులను కూడా నిలిపివేయగలిగారని డాక్టర్ రావుల ఫణి కృష్ణ పేర్కొన్నారు.