15 July, 2026 | 9:29 PM

కామారెడ్డిలో అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారుల కొరడా

15-07-2026 09:09 PM

పోలీస్ బందోబస్తు తో 12 వ్యాపార షెడ్లు కూల్చివేత 

అక్రమార్కుల్లో దడ

అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తాం 

మున్సిపల్ కమిషనర్ పర్వతాలు 

నోటీసుల తర్వాతే కూల్చి వే తలు చేపట్టాం: టీపీఓ వినీత్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు బుధవారం కొరడా జులిపించారు. ఎన్నో ఏళ్లుగా కబ్జాలు చేసి అక్రమ షెడ్లను నిర్మించిన వాటిని మునిసిపల్ అధికారులు ఎట్టకేలకు బుధవారం పోలీస్ బందోబస్తు తో తొలగించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల అనుచరుల షెడ్లను 19వ వార్డులో రామారెడ్డి రోడ్డుకు వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసుకున్న  షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. అనుమతులు లేకుండా నిర్మించిన 12 వ్యాపార షెడ్లను  పోక్లేన్లతో కూల్చివేయడం పట్టణవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సంఘటన స్థలానికి మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు భారీగా చేరుకుని ముందస్తు భద్రతా చర్యల మధ్య కూల్చివేత చేపట్టారు. కూల్చివేసిన  నిర్మాణాలకు ముందుగానే షోకాజ్ నోటీసులు, అనంతరం ఫైనల్ నోటీసులు జారీ చేశారు. చట్టబద్ధమైన అనుమతులు లేదా సముచిత వివరణ ఇవ్వకపోవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం కూల్చివేత చేపట్టినట్లు పట్టణ ప్రణాళిక అధికారి వినీత్ తెలిపారు.

పట్టణంలో  ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను గుర్తించి రాత్రికి రాత్రే షెడ్లు నిర్మించడం, అనంతరం వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందడం కొంతకాలంగా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తులు కలిసి సిండికేట్‌గా ఏర్పడి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే ప్రచారం పట్టణంలో వినిపిస్తోం ది. కొందరు అధికారుల అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు పెరిగాయని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇక అక్రమాలకు చోటు లేదు

మున్సిపల్ కమిషనర్ పర్వతాలు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చే ప్రతి అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా సరే మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు అక్రమ నిర్మాణాల సమాచారం అందించాలని కోరారు. టీపీఓ వినీత్ మాట్లాడుతూ, ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశామని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేత తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న మరికొన్ని నిర్మాణాలపై కూడా త్వరలో చర్యలు ఉండవచ్చనే చర్చ పట్టణంలో సాగుతోంది. 12 అక్రమ షెడ్ల నిర్మాణాలను తొలగించడంతో అక్రమ నిర్మాణదారుల్లో ఆందోళన మొదలైంది. మొక్కుబడి అక్రమ నిర్మాణాలను కొన్నిటిని తొలగించి మున్సిపల్ అధికారులు మమ అనిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.