16 July, 2026 | 12:35 AM

రాష్ట్రస్థాయిలో కన్కల్ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు

16-07-2026 12:18 AM

గ్రామ సర్పంచ్, ప్రధానోపాధ్యాయురాలికి సన్మానం

తాడ్వాయి, జూలై, 15( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులను చేర్పించినందుకు గాను రాష్ట్రస్థాయి అధికారులు కన్కల్ పాఠశాలను గుర్తించారు. గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఆశాజ్యోతిల పనితీరు బేష్ గా ఉందని అధికారులు కొనియాడారు.అందుకోసం గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుని హైదరాబాదులోని డీఎస్‌ఈ కార్యాలయానికి పిలిపించుకొని ఇద్దరికీ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అభినందించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ... కన్కల్ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 108 మంది విద్యార్థులు ఉండగా, ఈ విద్యా సంవత్సరం 280 పైగా విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం అభినందనీయమన్నారు. కన్కల్ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.సర్పంచ్, ఉప సర్పంచ్ మహేష్ ల పనితీరు బేష్ గా ఉందని కొనియాడారు. భవిష్యత్తులో కన్కల్ పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షమయ్య గౌడ్,ఉపాధ్యాయులు ఆశిరెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.