26 May, 2026 | 4:26 AM

సింగరేణి వికాసమే ధ్యేయం

26-05-2026 02:04 AM
  1. కోల్ బెల్ట్ సమస్యలపై 15 రోజులకోసారి సమీక్ష
  2. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): సింగరేణి వికాసమే తమ ధ్యేయమని, ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు.

సోమవారం హైదరాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలంలో జరిగిన సింగరేణి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున, అలాగే ప్రభు త్వం తరఫున కోల్ బెల్ట్ లో ఇచ్చిన హామీల అమలు విషయంలో తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రా ల్లో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించగలిగే కొత్త బ్లాకులను సింగరేణి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనేపథ్యంలో కొత్త బ్లాకులు సాధించేలా సింగరేణి తగు ప్రణాళికలు రూపొం దుకుని ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆయా ప్రాంత శాసన సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చా రు.

సింగరేణి అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న విజ్ఞప్తులను,  సూచనలను పరిగణలోకి తీసుకోవాలని భట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యానికి సూచించారు. దీనిపై  ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి కోల్ బెల్ట్ శాసన సభ్యులు సమర్పించే విజ్ఞాపనలపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.

సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎనర్జీ స్పెషల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎంపీ బలరామ్ నాయక్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్‌రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ,  మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు,  కోవా లక్ష్మీ పాల్గొన్నారు.