05-02-2026 01:48:43 AM
పీసీసీ లీగల్ సెల్ ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): చేవెళ్లలో న్యాయవాది స్వప్న దారుణ హత్యను పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గుండ్లపల్లి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా కోర్ట్ ఆవరణలో మాట్లాడుతూ.. స్వప్న హత్య కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, అది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన కోర్టుల్లో వాదించే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరమని, ఒక మహిళా అడ్వకేట్‌ను హత్య చేయటం సమాజం విఫలమైందనడానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను తీసుకురావాలని, తద్వారా న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్వప్న హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దేవులపల్లి సంతోష్ కుమార్, కన్వీనర్ పీఆర్‌వీ ప్రసాద్, సభ్యులు ఎం. సత్యనారాయణ, ఎస్. లక్ష్మయ్య, రమ్య, జీవన్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.