05-02-2026 12:15:31 AM
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థులకు రెబల్స్ గండం పొంచి ఉంది. ఆశావాదుల్లో టికెట్ కోల్పోయిన ప్రతికారాలు మిగిలే ఉన్నాయి. ఆయా వార్డుల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి బంగపడిన ప్రధాన పార్టీ ఆశావాదులు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ గెలుపు పై తీవ్ర ప్రభావం చూపనుంది. రెబల్స్ కాంగ్రెస్ అభ్యర్థులకు పక్కలోనే బల్లెములా తయారయ్యారు. కాంగ్రె స్ అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 4: అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో ముఖ్య ఘట్టం బీ ఫారంల జారీ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని రగిలించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ నామినేషన్ వేసి టికెట్ దక్కని ఆశవాదులు అధిష్టా నంపై తిరగబడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా బీఫారంల జారీ, అభ్యర్థుల ఖరారు ప్రక్రియ జరిగింది. టికెట్ కోల్పోయిన ఆశావాదులు బహిరంగంగానే ఎమ్మెల్యేపై అసమ్మతి గళం వినిపించారు.
సాక్షాత్తు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు తన భార్య కు టికెట్ ఖరారు అయినప్పటికీ, తన అనుచరులు, సోదరుడికి టికెట్ రాలేదని ఎమ్మెల్యేపై తిరగబడిన దృశ్యం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ కోసం కమిట్మెంట్ గా పని చేసిన తమకి ప్రాధాన్యత లేదని వాపోయారు.
ఒక దశలో తీవ్ర ఆవేశానికిలోనై కాంగ్రెస్ పార్టీకి రాజీనా మా చేసి తనకి కేటాయించిన టికెట్‌ను తిరస్కరించి పోటీ చేయనని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గడం అసమ్మతికి పరాకాష్టగా చెప్పవచ్చు. నమ్మిన వాళ్లకు టికెట్టివ్వకుండా వల సలకు పెద్దపీట వేశారనే అపవాదులను ఎమ్మెల్యేపై ఉన్నాయి. అభ్యర్థుల ఖరారులో సరైన పరిశీలన లేదని కొందరు ఆశావాహులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు, అధిష్టాన నిర్ణయం అనే ది వట్టిదని కొట్టిపారేస్తున్నారు. తమను మోసం చేయడానికే అలా చెప్పారని మండిపడ్డారు.
ఆశ చూపించి గొంతు కోశారు..
తొలుత నామినేషన్లు వేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీరా అభ్యర్థి ఖరారు జాబితాలో తమ పేరు లేకపోవడంపై పలువురు ఆశావాదులు అగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముందు ప్రోత్సహించి నామినేషన్ వేయించి తీరా కాద ని తమ గొంతు కోశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉంటుందా? అని వాపోతున్నారు. ముం దే టికెట్టు ఇవ్వమని చెప్పితే నామినేషన్ వేసి ఉండే వారం కాదని అంటున్నారు. ఇలాంటి మైండ్ గేమ్ ఆడి తమ పరువును బజారుకు ఈడ్చారన్న విమర్శలు ఆశావాదాల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్‌కు రెబల్స్ గుబులు..
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అసమ్మతి రెట్టింపు అయింది. ఆశించిన అభ్యర్థులకు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపడంతో ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు ప్రధాన గండంగా పరిణమించింది. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ బెడద తప్పడం లేదు. ఒక్కో వార్డు నుంచి నలుగురికి పైగా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ నామినేషన్ వేశారు. ఈ పోటీతత్వం కాంగ్రెస్ పార్టీకి అసమ్మతిగా మారింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోల్పోయిన వారిలో కొందరు సీనియర్లు, మాజీ కౌన్సిలర్లు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మనుగడకు ప్రధాన సమస్యగా మారింది.
ఫలించని బుజ్జగింపులు...
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి చుక్కెదురైన తిరుగుబాటు అభ్యర్థులు శాంతించడం లేదు. ఈ మేరకు ఒక పర్యాయం బుజ్జగింపు లు జరిగాయి. ఎవరూ కూడా సానుకూలంగా స్పందించలేదు. రెబల్స్ తమ గెలుపు కోసం కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించే లక్ష్యంతోనే రంగంలోకి దిగారు. వారిని పోటీ నుంచి తప్పించేందుకు నేర్పిన బుజ్జగింపులు ఫలించలేదు. ఇందుకోసం అంత సీరియస్‌గా ప్రయ త్నించిన పాపాన కూడా పోలేదన్న అభిప్రాయాలు కూడా అభ్యర్థుల్లో వ్యక్తమవుతు న్నాయి.
తూతూ మంత్రంగా బుజ్జగింపులు, మొక్కుబడిగా మాటవరసకు జరిగినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభ్యర్థుల జాబి తాను ప్రకటించి బీఫాములు ఎన్నికల అధికారులకు అందించి ఆ వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఇది కూడా అభ్యర్థుల్లో కాసింత అసంతృప్తినీ రేకెత్తించింది. తమ గెలుపుకు అడ్డంకిగా మారిన రెబల్స్ సమస్య తీరకుండాపోయిందనే ఆందోళన కనిపిస్తోంది.
టికెట్ కోల్పోయిన సీనియర్లు..
మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులు టికెట్ కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని పనిచేస్తున్న నాయకులకు అధిష్టా నం మొండి చెయ్యి చూపిందన్న అసంతృప్తు లు పెల్లుబికాయి. 34 వార్డుల్లో టికెట్ల ఖరారులో గజిబిజి చోటుచేసుకుంది. తాజా మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు అఫ్జల్, మాజీ తాజా కౌన్సిల ర్లు, నాయకులు జిలకర వాసు, పత్తిపాక రాజ్ కుమార్, బిజి శంకర్ సింగ్, ముత్తమల్ల కావ్య జ్యోతి, దాసరి ప్రతాప్, మేకల శ్రీనివాస్, లంకెల శ్రీనివాస్, కే చంద్రశేఖర్, పొట్ల సురేష్, నిచ్చెకోల వంశీకృష్ణ, కుంభాల రాజేష్, ఆరెపల్లి లావణ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరి బాబు సోదరుడు మత్తమారి రాజమల్లు, కొత్తపల్లి శ్యాం కుమార్ తదితరులు టికెట్ కోల్పో యారు.
కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించి అభ్యర్థిత్వాన్ని కోల్పోయినా కాంగ్రెస్ రెబల్స్ గా పోటీలో ఉన్నారు. రెబల్స్‌పై ప్రధాన ప్రత్య ర్థి పార్టీ బీఆర్‌ఎస్ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. ఈ దిశ గా సమీకరణలు కాంగ్రెస్‌పై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెబల్స్‌తో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నష్టపోయే పరిస్థితి కనిపిస్తుందని తెలుస్తోంది. పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లనుంది.