15 August, 2026 | 5:58 PM

ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం

15-08-2026 05:08 PM

వనపర్తి, (విజయక్రాంతి) : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వనపర్తి ఐడీఓసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ డా. పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమంలో భాగంగా వనపర్తి జిల్లాలో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల పంట రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. రైతు భరోసా కింద 1,82,768 మంది రైతులకు రూ.212.32 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలైన కంది, మినుములు, జొన్న, ఆముదం, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5,887 ఇళ్లు మంజూరు కాగా 88 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.3.75 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. గృహజ్యోతి కింద 87,763 కుటుంబాలకు ఉచిత విద్యుత్, చేయూత పథకం ద్వారా 70,863 మందికి నెలకు రూ.17.43 కోట్ల పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో విద్య, వైద్యం, రహదారులు, భూ సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్య నాయక్, వినోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 138 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.