బీసీల కులగణనపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కేంద్రం ప్రశ్నావళిలో బీసీల ప్రస్తావన లేదు
40 ప్రశ్నల్లో ఓబీసీల అంశం లేకపోవడం దారుణం
కులగణనలో బీసీల లెక్కలు చేర్చాలి
దేశవ్యాప్త కులగణనపై కేంద్రం మోసం
హైదరాబాద్: దేశవ్యాప్త కులగణనపై(Caste Census) కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని, కాంగ్రెస్తోనే బీసీలకు న్యాయం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. జనగణనపై కేంద్రం విడుదల చేసిన ప్రశ్నావళిలో బీసీల ప్రస్తావన లేదని విమర్శించారు. పూర్తి స్థాయి కులగణన చేస్తామన్నారు.. ప్రశ్నావళిలో బీసీల ప్రస్తావన లేదని అసహనం వ్యక్తం చేశారు. జనగణనలో కులగణన చేస్తామని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని గుర్తుచేశారు.
తెలంగాణ ఒత్తిడి వల్లే దేశవ్యాప్త కులగణన చేస్తామని చెప్పారని తెలిపారు. మోదీ అప్పుడు ప్రకటించి.. లెక్కల సేకరణకు వచ్చే సరికి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ప్రశ్నల్లో ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన మాత్రమే ఉందని చెప్పారు. పూర్తిస్థాయి కులగణన చేస్తామన్నారు.. ప్రశ్నావళిలో బీసీల ప్రస్తావన లేదున్నారు. జనగణనపై కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ ను సవరించాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలుసుకునే ప్రశ్నను చేర్చాలని కోరారు. దేశంలో ఎవరి జనాభా ఎంత ఉందో తెలిస్తేనే.. న్యాయం జరుగుతోందని వివరించారు.
రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేసి ఓబీసీలకు న్యాయం చేయాలన్నారు. బీసీ అయిన.. బండి సంజయ్ కూడా స్పందించకపోవడం బాధాకరమని మంత్రి పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కులగణనపై ప్రధానికి లేఖ రాస్తామన్న మంత్రి పొన్నం ఈ అంశంపై బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై రాంచందర్ రావు వైఖరి చెప్పాలన్నారు. బీసీ కులగణనపై కేంద్ర వైఖరిని మంత్రి పొన్నం ఖండించారు. బీసీలకు మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.






