30 April, 2026 | 2:55 PM

వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడు అరెస్ట్

30-04-2026 01:14 PM

మేడిపల్లి ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా రాత్రిపూట తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసు కొని వరుస చోరీలకు పాల్పడుతున్న  యువకుడుని మేడిపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి క్రైమ్ బృందం జరిపిన దర్యాప్తులో 10 కేసులను ఛేదించి, నిందితుడు వద్ద నుంచి చోరీ సొత్తు తో పాటు, బైక్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాకు చెందిన అలకుంట్ల ప్రశాంత్ అలియాస్ సంతు (19) ప్రస్తుతం బోడుప్పల్ లో నివసిస్తూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తునాడు. గతంలోనూ పలు నేరాలకు పాల్పడి జైలు కు వెళ్లి వచ్చాడు.

జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ప్రశాంత్ తన పద్ధతి మార్చుకోలేదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణా లను దోచుకునేవాడు. దొంగిలించిన వస్తువులను విక్రయించ దానికి తన బంధువుల సహాయం తీసుకునేవాడు. వరుస దొంగతనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో, పీర్జాదిగూడ కమాన్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు.

నిందితుడి నుండి హీరో హోండా స్పెండర్ బైక్, ఒక ఐఫోన్,40 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.వరుస నేరాలను ఛేదించిన మేడిపల్లి పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు తమ ఇళ్లకు పటిష్టమైన భద్రత కలిగిన తాళాలు వేసుకోవాలని, అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మేడిపల్లి సీఐ శంకరయ్య తెలిపారు.