రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బాన్సువాడ, ఆగస్టు 27 (విజయ క్రాంతి): ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ–కొత్తబాది ప్రధాన రహదారిపై మొగలాన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.కొత్తబాది గిర్ని తండాకు చెందిన పాల్యా రాజు (28) బైక్‌పై బాన్సువాడ నుంచి కొత్తబాది వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎన్‌హెచ్-765డీపై రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు.
ప్రమాద తీవ్రతకు రాజుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని, ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.రోడ్డుపై ట్రాక్టర్‌ను ఎలాంటి లైటింగ్ లేకుండా నిలిపి ఉంచడమే ప్రమాదానికి కారణమా.. లేక బైక్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






