27 August, 2026 | 4:35 PM

మారెళ్లపాడు ఎత్తిపోతలకు మంత్రుల రాక

27-08-2026 03:19 PM

29న ప్రారంభోత్సవం..

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ అంకిత్‌, ఎమ్మెల్యే పాయం

అశ్వాపురం, ఆగస్టు 27(విజయ క్రాంతి): సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 29న శనివారం రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనకు రానున్న నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ముందుగా మంత్రులు జిల్లాకు చేరుకునే అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం కాలువ, గొందిగూడెం–బీజీ కొత్తూరు పల్లె ప్రకృతి వనం సమీపంలోని సభా స్థలాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు, సభా ఏర్పాట్లు, ఇతర వసతులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.