27 August, 2026 | 4:35 PM

రాఖీ వేళ కిటకిటలాడిన బస్సులు

27-08-2026 03:21 PM

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకగా పుట్టింటి బాట పట్టిన సోదరీమణులు

అశ్వాపురం, ఆగస్టు 27(విజయక్రాంతి): రాఖీ పండుగ నేపథ్యంలో అశ్వాపురం మండలంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరీమణులు తమ సోదరుల ఇళ్లకు చేరుకునేందుకు పుట్టింటి బాట పట్టడంతో పల్లెలు, పట్టణాల మధ్య ప్రయాణించే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా రాఖీ పండుగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని క్షేమాన్ని కోరుకోవాలనే ఆప్యాయతతో మహిళలు ప్రయాణాలు చేస్తున్నారు.

బస్సుల్లో రద్దీ, ప్రయాణ ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా పుట్టింటికి చేరుకోవాలనే ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. రాఖీ కేవలం చేతికి కట్టే దారం కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య జీవితాంతం కొనసాగే అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సోదరీమణులు సోదరులను కలుసుకునేందుకు తరలివెళ్తుండటంతో బస్టాండ్లు, బస్సుల్లో పండుగ సందడి నెలకొంది. దీంతో అశ్వాపురం పరిసర ప్రాంతాల్లో రాఖీ పండుగ సందర్భంగా రవాణా రద్దీతో పాటు అన్నాచెల్లెళ్ల ఆత్మీయత వెల్లివిరిసింది.