యువకుడిపై బ్లేడ్‌తో దాడి.. మెడపై గాయాలు
మేడిపల్లి,(విజయక్రాంతి): పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై బ్లేడుతో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... బోడుప్పల్ ఇందిరా నగర్ కు చెందిన మంద సాయి కుమార్ (26) తన స్నేహితులు వాసు, రాహుల్ లతో కలిసి కట్ట మైసమ్మ వైన్స్‌లో మద్యం సేవించి బయటకు వచ్చాడు. ఈ సమయంలో చిలుకానగర్ వైపు నుంచి బైక్‌పై వచ్చిన జాన్, పవన్ తో పాటు మరికొందరు సాయి కుమార్‌ను అడ్డగించి పాత విభేదాల కారణంగా వాగ్వాదానికి దిగారు.
మాటామాటా పెరగడంతో సాయి కుమార్ ప్రశ్నించగా, జాన్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌ను తీసి సాయి కుమార్ మెడపై దాడి చేయగా, సాయి కుమార్ మెడకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే స్థానికులు, స్నేహితులు కలిసి బోడుప్పల్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






