ముఖ్యమంత్రిని గారు అనాలి.. నువ్వు అని సంబోధించొద్దు..
తలసానికి కోట నీలిమ హెచ్చరిక
సికింద్రాబాద్,ఆగస్టు21 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా సమాధానం చెప్పాల్సింది పోయి, ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరిచి నువ్వు.. నువ్వు అంటూ సంబోధించడం తలసాని రాజకీయ కుసంస్కారానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. సనత్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారని, అందులో భాగంగానే టిమ్స్ సనత్నగర్ నిర్మాణాన్ని కేవలం 32 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తలసాని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత హోదా కాదని, రాజ్యాంగబద్ధమైన అత్యున్నత ప్రజా బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని గారు అని సంబోధించాల్సిన కనీస రాజకీయ మర్యాద కూడా తలసాని మరిచిపోవడం దురదృష్టకరమన్నారు. ఇకపై ముఖ్యమంత్రిని గానీ, రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులను గానీ నువ్వు అంటూ అవమానకరంగా సంబోధిస్తే సనత్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజకీయంగా తగిన రీతిలో ప్రతిఘటిస్తారని ఆమె హెచ్చరించారు.
ఇకనైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన స్థాయిని, బాధ్యతను గుర్తుపెట్టుకుని మాట్లాడాలని డాక్టర్ కోట నీలిమ సూచించారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లే పరిస్థితిని తలసాని స్వయంగా తెచ్చుకోవద్దని, లేకపోతే ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వస్తుందని డాక్టర్ కోట నీలిమ ఘాటుగా హెచ్చరించారు.






