22 August, 2026 | 6:03 AM

బీసీలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

22-08-2026 12:18 AM
  1. జన గణనలో ఓబీసీ కాలం పెట్టకపోవడం అన్యాయం
  2. బీసీ హక్కుల ఉద్యమ నేతలు

హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని విడనాడాలని హర్యానా రాష్ట్రం నుంచి వచ్చిన ముఖ్య అతిథి ప్రొఫెసర్ యోగేంద్రనాథ్ యాదవ్, బీసీ హక్కుల ఉద్యమ నేత, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి చిరంజీవులు,అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జన గణనలో కుల గణన అనే గజట్ నోటిఫికేషన్‌లో ఓబీసీ కాలం పెట్టకపోవడం బీసీలపై చూపుతున్న సవతి తల్లి ప్రేమగా కనిపిస్తుంది అన్నారు.

ఈ జనగణనలో స్పష్టంగా ఓబీసీ కాలం, యూనిక్ కామన్ కోడ్ నెంబర్ ఒకటి బీసీలకు ఇస్తేనే ఆ కుల గణన చట్ట ప్రకారం చెల్లుతుంది అని పేర్కొన్నారు. దేశంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య కచ్చితంగా తెలవాలంటే యూనికోడ్ నెంబర్, ఓబీసీ కాలం పెట్టాకనే క్యాస్ట్ సెన్సెస్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు.

లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మా ఉద్యమాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీ సంఘాల అందరిని కలిసి వచ్చే బీసీ నాయకులందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఢిల్లీ కేంద్రంగా ఉధృతం చేస్తామని చిరంజీవులు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వాస్తవ జనాభా, సామాజికఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి,ప్రాతినిధ్యంపై ఖచ్చితమైన గణాంకాలు వెలుగులోకి రావాలి అని అన్నారు.