24 August, 2026 | 6:35 PM

యాదవ సంఘ భవనం సమాజ అభివృద్ధికి వేదికగా ఉండాలి

24-08-2026 05:02 PM

మహబూబ్ నగర్ రూరల్ ఆగస్టు(విజయక్రాంతి): యాదవ సంఘ భవనాన్ని కేవలం భవనంగా కాకుండా యాదవ సమాజ ఐక్యత, సామాజిక కార్యక్రమాలు, అభివృద్ధికి వేదికగా వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పోతన్‌పల్లి గ్రామంలో ముడా నిధులతో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, అనంతరం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోతన్‌పల్లి గ్రామంలో సుమారు 300 యాదవ కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో సంఘ భవనం అవసరాన్ని గుర్తించి, అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసేందుకు ముడా ద్వారా రూ.15 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సహకారంతో భవనం పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జి గోనెల శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, యాదవ సంఘం నాయకులు వెంకట నర్సయ్య, పోతన్‌పల్లి సర్పంచ్ మాధవ రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.