9 August, 2026 | 3:25 PM

ఆదివాసి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా

09-08-2026 02:13 PM

బోథ్, ఆగస్టు 9 (విజయక్రాంతి):  అదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గ్రామాల ప్రజల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ప్రపంచ ప్రజలందరూ గుర్తించారని అందుకే ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆదివాసి బిడ్డలను ప్రతి ఒక్కరు చదివించాలని చదువుతూనే ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది అన్నారు.

చదువు లేకపోతే జీవితం అంధకారంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే మండల కేంద్రంలో ఆదివాసీ భవనాన్ని నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రోడ్డు వసతి లేని గిరిజన గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కార్యక్రమం కింద రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దశలవారీగా జిల్లాలోని ఆదివాసి గ్రామాలకు మౌలిక పరమైన వసతులను కల్పించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ ఉద్యోగ సంఘాల నాయకులు భూమన్న, న్యాయవాది పి శంకర్, సర్పంచులు విశ్వేశ్వర్, వివిధ గ్రామాల ఆదివాసి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.